విస్టా ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక

రాష్ర్టానికి చెందిన ఔషధాల తయారీ సంస్థ విస్టా ఫార్మాకు అమెరికా నియంత్రణ మండలి యూఎస్‌ఎఫ్‌డీఏ గట్టి షాకిచ్చింది. నల్లగొండ జిల్లాలోని గోపాలపల్లి వద్ద ఉన్న ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ ఏస్టేట్‌లో ఉన్న కంపెనీకి చెందిన ప్లాంట్‌లో అనుసరిస్తున్న తీరుపై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) హెచ్చరిక లేఖను జారీ చేసింది. ముఖ్యంగా ఔషధాల తయారీకి సంబంధించి ఉపయోగించిన పరికరాలు, పాత్రల శుభ్రత, శుద్దీకరణలో అభ్యంతరాలు ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నది. సెప్టెంబర్ 19-23, 2016 మధ్యకాలంలో ఈ ప్లాంట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ నెల 5న విస్టా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ధనంజయ పేరున హెచ్చరిక లేఖ జారీ అయింది. మరింత సమాచారం ఇవ్వడానికి కంపెనీ వర్గాలు నిరాకరించారు. ఔషధ తయారీకి సంబంధించి పలు పరికరాలకు రంధ్రాలు పడ్డాయి. కీలక ఔషధాల తయారీలో సంస్థ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టింది. ముఖ్యంగా ప్రాణాలను కాపాడే మందుల తయారీలో సంస్థ అలసత్వం వహిస్తున్నదని, స్వచ్ఛమైన, గుర్తింపు, నాణ్యమైన, విభాగాలపై పట్టించుకోవడం లేదని లేఖలో పేర్కొంది. ఇప్పటి వరకు కంపెనీ దరఖాస్తు చేసుకున్న ఎలాంటి ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతివ్వలేదు.