విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ

ఉప రాష్ట్రపతి ఎన్నికను విపక్షాలు సీరియస్‌గా తీసుకున్నాయి. అధికారపక్షం కంటే ముందే అభ్యర్థిని కూడా ప్రకటించాయి. గాంధీజీ మనవడు గోపాలకృష్ణ గాంధీని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు కాంగ్రెస్‌ చీఫ్ సోనియా గాంధీ. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో జరిగిన 18 ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఆమె వెల్లడించారు.  గోపాలకృష్ణ సైతం తమ ప్రతిపాదనను అంగీకరించారని చెప్పారు సోనియా.

మహాత్మాగాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీ.. 1945, ఏప్రిల్‌ 22న దేవదాసు గాంధీ, లక్ష్మీ దంపతులకు జన్మించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ చేశారు. 1968 నుంచి 25ఏళ్లపాటు ఐఏఎస్‌గా సేవలందించారు. ఆ తర్వాత స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఆయన… ఉప రాష్ట్రపతితో పాటు రాష్ట్రపతి సెక్రటరీగా పని చేశారు. యూకేలో భారత హై కమిషనర్ గా కూడా సేవలందించారు. సౌతాఫ్రికా, శ్రీలంకలో హై కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత బెంగాల్ గవర్నర్ గా, బీహార్ అదనపు గవర్నర్  కూడా సేవలందించారు.

పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో జరిగిన ప్రతిపక్ష పార్టీల భేటీకి టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లకు చెందిన నేతలు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతిచ్చిన జేడీయూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం.