వినోద్ రాయ్‌పై సీఏసీ అసంతృప్తి

చీఫ్ కోచ్ రవిశాస్త్రిని బలవంతపెట్టి ద్రవిడ్, జహీర్‌ను ఎంపిక చేశారని క్రికెట్ పరిపాలక కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ చేసిన వ్యాఖ్యలపై సీఏసీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ వ్యాఖ్యలు తమను ఎంతో బాధించాయంటూ ఘాటైన పదజాలంతో ఓ లేఖను రాసింది. “జహీర్, ద్రవిడ్ ఎంపిక గురించి శాస్త్రితో ముందుగానే మాట్లాడాం. వాళ్ల సామర్థ్యాలను బట్టి కోచింగ్ సెటప్‌లో ఉంచాలని భావిస్తున్నట్లు చెప్పాం. దీనివల్ల జట్టుకు అదనపు ప్రయోజనం జరుగుతుందని గుర్తు చేశాం. దీనికి రవి తక్షణమే అంగీకారం తెలిపాడు. అప్పుడే జాక్, ద్రవిడ్‌ల ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. సమావేశం ముగిసిన వెంటనే పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ఇదే సమాచారాన్ని రాహుల్ జోహ్రీ, అమితాబ్ చౌదురి సమక్షంలో మీకు (రాయ్)కు ఫోన్ ద్వారా తెలియజేశాం” అని లేఖలో తెలిపింది. కోచ్ ఎంపిక కోసం తాము సర్వశక్తులు ఒడ్డి మనస్ఫూర్తిగా, ఆత్మసాక్షిగా పని చేశామని వెల్లడించింది. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చాలా సావధానంగా, సామరస్యంగా పని పూర్తి చేశామని చెప్పింది. కోచ్ ఎంపిక ప్రక్రియ గురించి తలెత్తిన అనుమానాలను తమరు బహిరంగంగా నివృత్తి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.  తద్వారా ఊహాగానాలకు, అబద్దాలకు చెక్ పెట్టాలని సూచించింది.