విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగిన వెంకయ్య

బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడుకి అరుదైన అవకాశం దక్కింది. ఉన్నతస్థాయి రాజ్యాంగ బద్దమైన ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా వెంకయ్యను ఎన్డీఎ ఎంపిక చేసింది. చిన్ననాటి నుంచే చురుకైన వ్యక్తిగా పేరున్న వెంకయ్యనాయుడు బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు.

1949 జులై 1న నెల్లూరు జిల్లాలోని చవటపాలెంలో సాధారణ రైతు కుటుంబంలో వెంకయ్య  జన్మించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ఈ స్థాయికి వచ్చారు. నెల్లూరులోని వీఆర్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆంధ్ర వర్సిటీ నుంచి లా పట్టా పొందారు. ఆ సమయంలోనే ఆర్‌.ఎస్‌.ఎస్‌ ఐడియాలజీకి ఆకర్షితులై ఏబీవీపీలో చేరారు. 1977 నుంచి 80 వరకు ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత రాజకీయాల్లో చేరి…. 1978లో తొలిసారిగా ఉదయగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోసారి అదే నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980 నుంచి 85 వరకు ఏపీ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు.

1985 నుంచి 88 వరకు బీజేపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వెంకయ్య పనిచేశారు.  1998లో రాజ్యసభకు ఎన్నికైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తుండటం విశేషం. కర్ణాటక నుంచి మూడుసార్లు, రాజస్థాన్‌ నుంచి ఒకసారి రాజ్యసభ సభ్యునిగా అవకాశం దక్కించుకున్నారు. బీజేపీలో నాలుగు సార్లు రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన అతికొద్ది మందిలో వెంకయ్య ఒకరు.

ఎన్డీయే అధికారంలోకి వచ్చాక 2000 సంవత్సరంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు పనిచేశారు. 2002లో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టారు. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా రెండుసార్లు వెంకయ్యనాయుడు బాధ్యతలు నిర్వహించారు. ఎన్డీఏ అధికారం కోల్పోయిన తర్వాత రాజ్యసభలో విపక్ష నేతగా ఎంపికై సమర్థవంతంగా అధికార పక్షాన్నిఎదుర్కొన్నారు.  2014 వరకు రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నారు.  2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఎ ఘన విజయం సాధించటంతో మళ్లీ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోడీ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ స్థానంలో అదనంగా సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఆర్‌.ఎస్‌.ఎస్ తో సహా బీజేపీలో వెంకయ్యనాయుడు అంటే అపారమైన గౌరవం ఉంది. వాజ్‌పేయి, అద్వానీ, మోడీ ఇలా అగ్రనేతలందరితో వెంకయ్యనాయుడుకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఇబ్బందుల్లో ఉన్న అన్ని సందర్భాల్లో వెంకయ్య ముందుండి సమస్యను పరిష్కరించే వారు. బీజేపీలో ట్రబుల్ షూటర్‌ గా ఆయనకు మంచి పేరుంది.

రాజకీయ జీవితం ప్రారంభమైన నాటి నుంచి ఆయన బీజేపీతోనే ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన లోక్‌సభ ఎంపీగా పోటీ చేయలేదు. మోడీ వేవ్‌ లోనూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చ లేని నేతగా వెంకయ్యకు పేరుంది. ఐతే, ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావటంతో ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే భావిస్తున్నారు.