వింబుల్డన్ ఫైనల్లోకి ఫెదరర్, సిలిచ్

గత వైభవాన్ని చాటుతూ రోజర్ ఫెదరర్ మళ్లీ విజృంభించాడు. రికార్డుస్థాయిలో ఎనిమిదో వింబుల్డన్ టైటిల్‌పై గురిపెట్టిన స్విస్ మాస్టర్ తన లక్ష్యానికి అడుగుదూరంలో నిలిచాడు. సెమీఫైనల్లో చెక్ ఆటగాడు బెర్డిచ్‌ను ఓడించి 11వసారి ఫైనల్ కు చేరాడు. మూడోసీడ్ ఫెదరర్ 7-6 (7-4), 7-6 (7-4), 6-4తో చెక్ రిపబ్లిక్ ఆటగాడు థామస్ బెర్డిచ్‌పై విజయం సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో క్రొయేషియా ఏస్‌ల వీరుడు మారిన్ సిలిచ్‌తో ఫెదరర్ తలపడుతాడు. మరో సెమీస్‌లో అమెరికా సంచలనం సామ్ కెర్రీ జోరుకు సిలిచ్ బ్రేక్‌వేశాడు.
అటు ఇప్పటిదాకా ఈ వేదికపై క్వార్టర్స్ కూడా దాటలేకపోయిన సిలిచ్ పదకొండో ప్రయత్నంలో ఏకంగా ఫైనల్‌కు దూసుకొచ్చాడు. సెమీఫైనల్లో ఏడోసీడ్ సిలిచ్ 6-7 (6/8), 6-4, 7-6 (7/3), 7-5తో అమెరికా సంచలన ఆటగాడు సామ్ కెర్రీపై విజయం సాధించి తుది సమరంలో నిలిచాడు. గతరౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ ఆండీ ముర్రేకు షాకిచ్చిన కెర్రీ సెమీస్‌లో మాత్రం సిలిచ్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. దాదాపు మూడుగంటలపాటు సాగిన పోరులో తొలిసెట్ నెగిన కెర్రీ, తర్వాత వరుససెట్లలో అదేజోరు చూపలేకపోయాడు. 26 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఏస్‌ల వీరుడుగా పేరుగాంచిన సిలిచ్ ఈ మ్యాచ్‌లో 25 ఏస్‌లను సంధించడం విశేషం. ఇక ఏకంగా 70 విన్నర్లతో విరుచుకుపడ్డాడు. ఆదివారం జరిగే ఫైనల్లో స్విస్ మాస్టర్ రోజర్ ఫెదరర్‌తో సిలిచ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. 28ఏండ్ల సిలిచ్ 2014లో యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచి కెరీర్‌లో ఏకైక గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్ చేరడం అతనికిదే తొలిసారి. ఫైనల్లోనూ రాణిస్తానన్న విశ్వాసముంది అని సెమీస్ మ్యాచ్ ముగిశాక సిలిచ్ అన్నాడు.