విండీస్ టూర్ లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ

మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న టీమిండియా ఆశలపై విండీస్ నీళ్లు చల్లింది, అంటిగ్వా వేదికగా జరిగిన నాలుగో వన్డే లో అనుహ్యంగా టీమిండియాను 11 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 190 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా కేవలం 178 పరుగులే చేసి ఆలౌట్ అయింది

స్వల్ప లక్ష్యఛేదనలో టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ పేసర్ల ధాటికి 47 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ధావన్ 5, కోహ్లీ 3, కార్తిక్ 2 పరుగులే చేసి నిరాశ పర్చారు. అయితే నాలుగో వికెట్ కు 54 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశారు. 91 బంతుల్లో 7 ఫోర్లతో 60 రన్స్ చేసిన రహానేను బిషో ఔట్ చేశాడు. జాదవ్ సైతం 10 పరుగులే చేశాడు. చివర్లో ధోనీ, పాండ్యా పోరాడినా విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు, అత్యంత జిడ్డు బ్యాటింగ్ తో నిరాశ పర్చిన ధోనీ 114 బంతుల్లో 54 రన్స్ చేసి ఔట్ కావడంతో భారత పరాజయం ఖరారైంది, విండీస్ బౌలర్లలో హోల్డర్ కు ఐదు, జోషఫ్ కు రెండు వికెట్లు దక్కాయి.

 అంతకు ముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ కు ఓపెనర్లు మంచి శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్ కు 57 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశారు. అయితే మిడిలార్డర్ వైఫల్యంతో విండీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. దీనికి తోడు టీమిండియా బౌలర్లు సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడమే గగనం అయింది. దీంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 189 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, పాండ్యాలకు తలో మూడు వికెట్లు దక్కగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఇక సిరీస్ నిర్ణయాత్మక చివరి వన్డే ఈ నెల 6న కింగ్స్‌టన్ వేదికగా జరగనుంది. ప్రస్తుతం టీమిండియా 2-1 తేడాతో ముందంజలో ఉంది