విండీస్ గడ్డపై భారత్ ఘనవిజయం

విండీస్ గడ్డపై భారత్‌ విజయ దుందుభి మోగించింది. వన్డే సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. చివరి వన్డే లో 8 వికెట్ల తేడాతో నెగ్గి 3-1 తేడాతో సిరీస్ ను దక్కించుకుంది. కింగ్స్ టన్ సబీనా స్టేడియంలో జరిగిన ఆఖరి మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. దినేష్ కార్తిక్ అర్ధ సెంచరీతో దుమ్ములేపాడు. దీంతో టీమిండియా విండీస్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండే వికెట్లు కోల్పోయి 36.5 ఓవర్లలోనే ఛేదించింది. కోహ్లీ 111, కార్తిక్ 50 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

లక్ష్యఛేదనలో టీమిండియాకు తొలి ఓవర్ లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ధావన్ 4 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఇక రహానేకు జతైన కెప్టెన్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో అలరించాడు. రెండో వికెట్ కు రహానే తో కలిసి 79 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 39 పరుగులు చేసిన రహానే బిషో బౌలింగ్ లో ఔట్ కాగా.. దినేష్ కార్తిక్ అండతో విరాట్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కెరీర్ లో 28వ  వన్డే సెంచరీ చేశాడు. ఇక దినేశ్ కార్తిక్ సైతం అర్థసెంచరీతో చివరి వరకు క్రీజ్ లో నిలిచాడు.

అంతకు ముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ .. భారత స్పిన్నర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. షో హోమ్ అర్థసెంచరీ తో కాసేపు పోరాడగా.. కైల్ హోప్ 46 రన్స్ చేసి పర్వాలేదనిపించాడు. చివరల్లో కెప్టెన్ హోల్డర్, పావెల్ లు  వేగంగా ఆడటంతో విండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 205 పరుగులే చేసింది. టీమిండియా బౌలర్లలో షమీకి నాలుగు, ఉమేష్ యాదవ్ మూడు వికెట్లు తీశారు.సూపర్ బ్యాటింగ్ తో అలరించిన కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఇక ఈ నెల 9న ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్ జరగనుంది