వరద సహాయక చర్యల్ని పరిశీలించిన అస్సోం సీఎం

భారీ వర్షాలతో అస్సోం చిగురుటాకులా వణికిపోతోంది. గత మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. దాంతో  2500 గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. దాదాపు 48వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు 45 మంది చనిపోగా.. పలువురు గల్లంతయ్యారు. కజిరంగా నేషనల్‌  పార్కు సైతం నీట మునిగింది. దాంతో ఖడ్గమృగాలు, అడవి దున్నలు, దుప్పులు విలవిల్లాడుతున్నాయి.

ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. కజిరంగా నేషనల్ పార్కును సందర్శించిన సీఎం.. బోట్లో పార్క్ మొత్తం కలియ తిరిగారు. వెంటనే జంతువులకు పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సోనోవాల్‌.