ల‌క్ష బహుమతి ఇచ్చే స్వచ్ఛదూత్!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో త‌డి, పొడి చెత్తను వేరుచేసే గృహిణుల‌కు ప్రోత్సాహకంగా ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి అందించే ప‌థ‌కం స్వచ్ఛదూత్‌ను రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రారంభించారు.

త‌డి, పొడి చెత్తను వేరు చేయ‌డం ద్వారా 75 శాతం చెత్త పున‌ర్వినియోగం అవుతున్నందున త‌ప్పనిస‌రిగా ఇంటి వ‌ద్దనే వేరు చేయ‌డానికి జీహెచ్ఎంసీ హైద‌రాబాద్ న‌గ‌రంలో 44 ల‌క్షల డస్ట్ బిన్‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసింది. దాదాపు 29కోట్ల రూపాయ‌ల వ్యయంతో డ‌స్ట్‌ బిన్‌ల‌ను అందించింది. పూర్తిస్థాయిలో ల‌క్ష్యాన్ని చేరుకునే దిశ‌గా జీహెచ్ఎంసీ ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తిని ప్రక‌టించింది. ఇందుకుగాను ఇంటి వ‌ద్దనే త‌డి, పొడి చెత్తగా వేరుచేసి జీహెచ్ఎంసీ గార్బెజ్ క‌లెక్టర్లకు అందించే మ‌హిళ‌లు ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తి పొంద‌డానికి త‌మ పేర్లను న‌మోదు చేసుకునేందుకు అనువుగా స్వచ్ఛ దూత్ మొబైల్ యాప్‌ను జీహెచ్ఎంసీ రూపొందించింది. దీన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి స్వచ్ఛదూత్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని వ‌న్‌టైం రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. అనంత‌రం తాము ఇంట్లో చేప‌డుతున్న త‌డి, పొడి చెత్త వేరుచేసే డస్ట్ బిన్‌ల ఫోటోల‌ను అప్‌లోడ్ చేయాల‌ని కోరారు. ఈ యాప్‌ ద్వారా వ‌చ్చిన ఎంట్రీలను ప్రతి నెల లాట‌రీ తీసి ఒక గృహిణికి ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్రక‌టించ‌నున్నట్టు తెలిపారు. ఇప్పటికే త‌డి, పొడి చెత్త వేరు చేయ‌డానికి ఇంటింటికి రెండు డ‌స్ట్ బిన్‌ల‌ను అందించ‌డం, చెత్త సేక‌ర‌ణ‌కు 2వేల స్వచ్ఛ ఆటో ట్రాలీల‌ను ప్రవేశ‌పెట్టడం ద్వారా దేశంలోని ఇత‌ర మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల క‌న్నా జీహెచ్ఎంసీ ముందంజ‌లో ఉంది.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, వైద్య‌, ఆరోగ్య శాఖ కార్యద‌ర్శి రాజేశ్వర్ తివారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థన్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.