లాల్ దర్వాజ బోనాల తొలిపూజ

హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి బోనాల తొలిఘట్టం మొదలైంది. తొలి పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ క్రతువులో పాల్గొన్నారు. అమ్మవారిని స్థాపించి 109 సంవత్సరాలు అయినా సందర్భంగా ఈ సంవత్సరం 11 రోజులపాటు బోనాల వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ తెలిపింది.

తొలిపూజ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బంది బోనాలకు విధులు నిర్వహించనున్నట్లు సీపీ చెప్పారు. ఆధునిక సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. గత సంవత్సరం 2 నుండి 3లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. లక్ష కుంకుమార్చన మొదలుకొని అనేక క్రతువులు ఇక్కడ నిర్వహిస్తారు.