లాలూ కొడుకు పదవి ఉండేనా? ఊడేనా?

ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ పదవికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. అవినీతి, బినామీ ఆస్తుల కేసులో తేజస్వి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించడంతో బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఆయన్ను కేబినెట్‌ నుంచి పొమ్మనకుండానే పొగబెట్టారు. తేజస్వి వ్యవహారంపై చర్చించేందుకు జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలతో నితీశ్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సచ్ఛీలురుగా నిరూపించుకోవాలి. లేదా కేబినెట్‌ నుంచి వైదొలగాలి. దీనిపై నాలుగు రోజుల తర్వాత మళ్లీ భేటీ అవుదాం. తుది నిర్ణయం తీసుకుందాం’ అని నితీశ్‌ పార్టీ శ్రేణులతో స్పష్టం చేసినట్లు సమాచారం. అటు తేజస్వి తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆర్జేడీ స్పష్టం చేసింది. తేజస్విని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఒత్తిళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో బిహార్‌లో మహాకూటమికి బీటలు వారే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, ఆర్జేడీ ఎంపీ మీసా భారతి ఈడీ విచారణకు హాజరయ్యారు. రూ.8వేల కోట్ల మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా ఆమెను అధికారులు సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు.