రైల్వే శాఖ తీరుని పార్లమెంటులో ప్రస్తావిస్తా

కొత్త రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రైల్వే శాఖ తమ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలనలో, స్వాతంత్ర్యం అనంతరం సామాన్యులకు సేవలందించేదిగా రైల్వే వ్యవస్థను చూశారని.. రైల్వేమంత్రి సురేశ్ ప్రభు మాత్రం సామాన్యులను పట్టించుకోకుండా లాభనష్టాలను బేరీజు వేయడం శోచనీయమన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు. రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ ను కలిసిన వినోద్.. పలు అంశాలపై విజ్ఞప్తులను అందజేశారు.

కరీంనగర్ నుంచి వారానికి రెండుసార్లు నడుస్తున్న కరీంనగర్ – తిరుపతి ఎక్స్‌ప్రెస్ ను రోజూ నడపాలని ఎంపీ వినోద్ విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్‌ – నాగపూర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌ – పాట్నా ఎక్స్‌ప్రెస్ లను జమ్మికుంటలో ఆపాలని కోరారు. సామాన్యులు, వ్యాపారస్తులకు జమ్మికుంట స్టాప్ చాలా కీలకమన్నారు. కాగజ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ ను ఉప్పల్ లో ఆపాలని కోరామన్నారు. కొత్త జిల్లాగా ఏర్పడ్డ భూపాలపల్లి, పరిపాలనకు హెడ్ క్వార్టర్ అయిన కమలాపూర్ కు ఈ స్టాప్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని వినోద్ చెప్పారు.