రైతు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంద‌ి

రైతుల సంక్షేమానికి కృషి చేయాల‌ని నిజామాబాద్ వ్యవ‌సాయ మార్కెట్ క‌మిటీ నూతన  పాల‌క‌ మండ‌లికి మార్గనిర్దేశ‌నం చేశారు ఎంపి క‌విత‌. నిజామాబాద్ మార్కెట్లో నూత‌న క‌మిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. అన్ని విధాల న‌ష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్న రైతుల‌ను ఆదుకోవ‌డ‌మే క‌ర్తవ్యంగా నూత‌న క‌మిటీ ప‌నిచేయాలని సూచించారు. వ్యవ‌సాయోత్పత్తుల‌కు స‌రైన ధ‌ర ల‌భించేలా చూడాల‌న్నారు. రైతు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంద‌న్న విష‌యాన్ని మ‌రువ‌రాద‌ని చెప్పారు.

మార్కెట్ క‌మిటీల‌లో మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించిన ఘ‌న‌త మ‌న ముఖ్యమంత్రి  కేసీఆర్ ది అన్నారు కవిత. మార్కెట్ క‌మిటీల‌లో రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని సిఎం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం వ‌ల్లే మ‌హిళ‌ల‌కు చైర్మన్లుగా, డైరెక్టర్‌లుగా అవ‌కాశం ల‌భించింద‌ని తెలిపారు క‌విత‌. నిజామాబాద్ మార్కెట్ ఇప్పుడు రెండో స్థానంలో ఉంద‌ని, నెంబ‌ర్ వ‌న్ స్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాల్సిన బాధ్యత నూత‌న క‌మిటీపై ఉంద‌న్నారు.

రైతులు, అధికారులు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషితో ఈ-నామ్ అవార్డు నిజా‌మాబాద్ మార్కెట్ కు వ‌చ్చింద‌ని ఎంపీ కవిత ప్రశంసించారు. నిజామాబాద్ రైతులు క‌ష్టప‌డే త‌త్వం ఉన్నవారని కొనియాడారు. దేశంలోని మార్కెట్‌ల ధ‌ర‌ల‌ను ఎప్పటిక‌ప్పుడు తెలుసుకుంటూ స‌రైన ధ‌ర‌ల‌ను క‌ల్పించే అవ‌కాశం ఇప్పుడుందని చెప్పారు. అద‌న‌పు కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను తెచ్చుకుందామ‌న్నారు. మంత్రి హ‌రీశ్ రావును ఎంపీ కవిత ఈ సందర్భంగా అభినందించారు. మార్కెట్ కు వచ్చే రైతులకు స‌ద్దిమూట కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రశంసించారు.

నిజా‌మాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా అధ్యక్షత‌న జ‌రిగిన ఈ కార్యక్రమంలో సిఎం కార్యాల‌యం ప్రత్యేకాధికారి దేశ‌ప‌తి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్‌, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధన్‌, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్నగారి జీవ‌న్ రెడ్డి, మేయ‌ర్ సుజాత‌, రెడ్ కాప్ ఛైర్మన్ అబ్దుల్ అలీం, దివ్యా దినేష్‌, వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖ‌ర్ రెడ్డితో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.