రెండేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

రోళ్లవాగు ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటిని పూర్తి చేసి సాగునీరుతో పాటు వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ వద్ద రోళ్లవాగు ప్రాజెక్టు పనులకు నేడు పలువురు ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ధర్మపురిలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో పాల్గొని మంత్రి ప్రసంగించారు.

కాళేశ్వరం నీటిని ఎత్తిపోతల ద్వారా ఎస్సార్‌ఎస్పీకి తరలిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అదేవిధంగా ఎస్సార్‌ఎస్పీ ప్రాజెక్టు కింద రెండు పంటలకు నీరు ఇస్తామన్నారు. భవిష్యత్‌లో వర్షాల కోసం ఎదురుచూసే అవసరం ఉండదని చెప్పారు. గత ప్రభుత్వాలు ఎస్సారెస్పీ కాల్వలను పట్టించుకోలేదన్న ఆయన, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణకు సీఎం కేసీఆర్ రూ. 186 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో ఐదు లిఫ్టులు ఆగస్ట్ నెలలో ప్రారంభించి 10 వేల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రకటించారు.

ఈ సభలో మంత్రి హరీశ్ రావుతో పాటు మరో మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, బాల్క సుమన్, కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు మాట్లాడారు.