రూ. వెయ్యి కోట్లతో గోదాములు

సంక్షేమ పథకాల అమలులో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ అన్నారు. పండించిన ధాన్యాన్ని రోడ్లపైన వేసే దుస్థితి నుంచి దాచుకునే స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసే సామర్థ్యం ఉన్న గోదాములు నిర్మించినట్టు వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  మంత్రి కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వెంకటాపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం బొప్పాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ప్రసంగించారు.

కాంగ్రెస్ పాలనలో వచ్చిరాని కరెంట్ కోసం రైతులు కళ్లల్లో వత్తులేసుకుని పంట చేల వద్ద కాపలా కాసే వారన్నారు. పట్టపగలే 9గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దేనన్నారు. పరిపాలించే వ్యక్తి మనసు మంచిదైతే, దైవ భక్తి ఉంటే సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ఏడెనిమిదేండ్ల కరువు పరిస్థితులను మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. యూపీలో కొత్తగా వచ్చిన బీజేపీ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తామంటూ గొప్పలు చెప్పిందని, తీరా లెక్కలు తీస్తే రూ.36 వేల కోట్లు రావటంతో ఎలా మాఫీ చేయాలో తెలియక అయోమయంలో పడింద న్నారు. తెలంగాణ జనాభా నాలుగు కోట్లు అయితే ఉత్తరప్రదేశ్ జనాభా 22 కోట్లని, మనకన్నా ఆరు రెట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం కిందమీద పడుతుంటే అన్నదాతల బాధలు తెలిసిన కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశారన్నారు.

ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన పార్టీ ఏదీ లేదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్రలో నిలిచి పోయిందన్నారు. రైతులే కాకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ ముందుకు పోతున్నామన్నారు. వచ్చే నెలలో మధ్య మానేరులో 10 టీఎంసీల నీటిని నిల్వచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు.