రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి అనే నిబంధన ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధార్‌కార్డు ఉంటేనే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. అక్రమ, బోగస్ రిజిస్ట్రేషన్లకు పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి వీలుగా ఈ విధానాన్ని అనుసరించనున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు ఇప్పటికే ఆధార్ వెబ్‌ సైట్‌తో రిజిస్ట్రేషన్లశాఖ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేశారు. కొంతకాలంగా మేడ్చల్ జిల్లా మల్కాజ్‌గిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రమంతటా అమలుపరుచాలని నిర్ణయించారు. ఇకపై కొనుగోలుదారులు, అమ్మకందారులు, సాక్షులు కూడా ఆధార్‌కార్డును సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కొనుగోలుదారులు, అమ్మకందారులు డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపుకార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డుల్లో ఏది ఉన్నా రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తున్నారు. చాలామంది ఆధార్‌కార్డు సమర్పించకపోవడం వల్ల ఒక వ్యక్తికి బదులు మరొకరు లేదా డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 32-ఏ ప్రకారం ఆధార్‌ను తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రతీ రిజిస్ట్రేషన్‌కు ఆధార్ తప్పనిసరని… కానీ అత్యవసర లేదా గత్యంతరం లేని పరిస్థితుల్లో సబ్‌రిజిస్ట్రార్ ప్రత్యేక స్క్రూటినీ చేయొచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి. విదేశాల్లో ఉండే ఎన్నారైలు తమ ఆస్తులను అమ్ముకోవాలన్నా, ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేయాలన్నా ఆధార్ లేనిపక్షంలో పాస్‌పోర్టును సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.