రాష్ట్ర రైతులకు ఆర్బీఐ ఊరట  

సాగు సమయంలో ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం ఆర్బీఐ 2 వేల 600 కోట్ల నగదు విడుదల చేసింది.  రాష్ట్రప్రభుత్వం రాసిన లేఖపై స్పందించిన ఆర్బీఐ ఈ మొత్తానికి రాష్ట్రంలోని అన్ని బ్యాంక్ లకు పంపించింది. ఈ నెల మొదటి వారంలోనే రెండు వేల కోట్లు రిలీజ్ చేసిన ఆర్బీఐ.. ప్రస్తుత నగదును గ్రామీణ రైతుల అవసరాలు తీర్చేందుకు వినియోగించాలని బ్యాంక్ అధికారులను ఆదేశించింది. రైతుల గుర్తింపు కార్డులు, పాస్‌పుస్తకాల అధారంగా ఈ నగదు చెల్లింపులుంటాయని బ్యాంక్ అధికారులు తెలిపారు

ఇక గడిచిన నాలుగు నెలలలో తెలంగాణకు 20వేల కోట్ల విలువైన నగదు విడుదల చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. ఏప్రిల్ నెలలో 6వేల 500కోట్లు, మే నెలలో 5వేల 500కోట్లు, జూన్‌లో 3 వేల 400కోట్ల నగదు పంపిణీ చేశామన్నారు. ఈ నెల రెండు దఫాలు కలిపి 4 వేల 600కోట్ల విలువైన నగదు పంపించామని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు ఈసారి 80నుంచి 90శాతం తక్కువ విలువ గలిగిన నోట్లే ఇచ్చామని ఆర్బీఐ అధికారులు తెలిపారు.

అటు పెద్దనోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలోని బ్యాంకులలో నగదు కొరత తీవ్రమైంది. ప్రధానంగా డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ తెలియని రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది భారీగా వరి ధాన్యాన్ని సేకరించి 11 లక్షల మంది రైతులకు దాదాపు రూ.8వేల కోట్లు చెల్లించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్  ద్వారా సకాలంలో ధాన్యానికి గిట్టుబాటు ధర కట్టి రైతుల ఖాతాల్లో డబ్బు జమచేస్తున్నది. దేవుడు కరుణించినా పూజారి అనుగ్రహించలేదన్న మాదిరిగా సర్కార్ బ్యాంకులలో డబ్బులను జమచేసినా బ్యాంకుల దగ్గర నగదులేక రైతులకు చెల్లింపులు జరుగడం లేదు. ఇచ్చిన బ్యాంకులు కూడా 90శాతం పెద్దనోట్లే ఇస్తున్నాయని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలాచోట్ల బ్యాంకులు చేతులెత్తేయగా రైతులు వాటిచుట్టూ తిరుగుతూ తిప్పలు పడాల్సి వచ్చింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. రైతుల అవసరాలను తీర్చడానికి వెంటనే రూ.5నుంచి 10వేల కోట్ల నగదును ప్రత్యేకంగా పంపాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి లేఖ రాసింది.

రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తితో రైతుల చెల్లింపులకు ప్రత్యేకంగా రైతుల కోటలో నగదు పంపుతున్నట్లు ఆర్బీఐ ప్రభుత్వానికి లేఖ రాసింది. కేవలం రైతుల కోసమే నగదును పంపడం దేశంలోనే మొదటిసారని అధికారులు చెప్తున్నారు.