రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా తీరాలను ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు ఇవాళ, రేపు కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తగూడెంలో 9సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపిలేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా వందలాది చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మొర్రేడువాగు, కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో గడిచిన 24గంటల్లో సగటున 8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సూర్యాపేట జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, తిరుమలగిరి, హుజూర్‌నగర్ పట్టణాల్లోనూ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. గడ్డెన్నవాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టులోకి నీరు క్రమంగా వచ్చి చేరుతున్నది. జిల్లావ్యాప్తంగా సరాసరి 28.3 మిల్లీ మీటర్లు, ఆదిలాబాద్‌లో 6.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌లో 2.5 సెం.మీటర్ల వర్షం పడింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 26.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సరాసరిగా 19 మిల్లిమీటర్ల వర్షం పడింది.

మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 469.2 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ రూరల్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఖానాపురం మండలం పాకాల సరస్సులోకి 15.6 అడుగుల నీరు చేరింది. 19 అడుగులకు నీరు చేరడంతో చలివాగు జలాశయం కళకళలాడుతున్నది. ఖమ్మం జిల్లా అంతటా ఓ మోస్త రు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 31.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సగటున 22.1 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలో సోమవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా నార్కట్‌పల్లి మండలంలో 7.4 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.