రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు

గెరువివ్వని వానతో రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు దంచికొట్టాయి. ఎడతెగకుండా కురుస్తున్న వర్షధారలతో  తెలంగాణ తడిసి ముద్దయ్యింది. వర్షాలతో వాగులు, వంకలు, చెరువులకు నీటిమట్టం పెరుగుతున్నది. ఉరకలెత్తుతున్న ప్రవాహాలతో నీటి వనరుల్లో జలకళ  వచ్చింది.

విరామం ఇవ్వకుండా కురిసిన వానతో హైదరాబాద్‌ తడిసి ముద్దవుతోంది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన కురిసింది. తెరిపినివ్వకుండా కురుస్తున్న వానకు.. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

జిల్లాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. మిగతా జిల్లాల్లో ఓ మాదిరిగా వానలు కురుస్తున్నాయి. వాహనదారులకు కాస్త ఇబ్బంది కలిగినా నీటి వనరులకు వరద పోటెత్తుతుండటంతో.. ఎటు చూసినా నీటిరంగేసుకున్న ప్రకృతి ఆహ్లాదకరంగా మారింది. నీటివనరులన్నీ మరింత ఉప్పొంగుతున్నాయి.  భారీ వర్షాలు  రైతన్నలకు  ఆనందం కలిగిస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సత్తుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమృద్దిగా వర్షాలు కురుస్తున్నాయి. అశ్వరావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో 40గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు పాల్వంచలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ఏరియాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షానికి కాకతీయ ఓపెన్ కాస్ట్ సెక్టార్ -1 లో నీరు నిలిచింది. డంపర్లు, డోజర్లు, జేసీబీలు, లారీలు ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజుకి సుమారు తొమ్మిది వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీని ద్వారా సింగరేణికి రెండు కోట్ల మేర నష్టం వాటిల్లనుంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన వర్షాలతో చెరువులకు జలకళ వచ్చింది. గోవిందరావు పేట మండలంలోని లక్నవరం సరస్సుకు ఎగువనుంచి భారీగా వరద వచ్చి చేరుతున్నది. దీంతో, చెరువులో 17 అడుగుల మేరకు నీటిమట్టం పెరిగింది. వరద ఉధృతి పెరుగుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశమున్నది.

మరో మూడురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.