రాష్ట్రంలో దంచి కొడుతున్న వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా  వర్షాలు జోరుగా  కురుస్తున్నాయి.  హైదరాబాద్‌ తో  పాటు అన్ని జిల్లాలోనూ  వర్షాలు  దంచికొడుతున్నాయి. రానున్న  48 గంటల్లో  రాష్ట్రంపై ద్రోణి ప్రభావంతో..  పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు గ్రేటర్‌ హైదరాబాద్‌  పరిధిలోనూ నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై.. కాలనీలలో వర్షపు నీరు ప్రవహించింది. ఇక వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం స్థిరంగా  కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.  అటు ఒడిషా  నుంచి కోస్తాంధ్ర  మీదుగా  దక్షిణ తమిళనాడు వరకు  ద్రోణి ప్రభావం ఉండడంతో.. మరో  రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు  పేర్కొన్నారు.

భారీ వర్షానికి గ్రేటర్‌  హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో తడిసి ముద్దయ్యాయి. ఖైరతాబాద్‌, శ్రీనగర్‌ కాలనీలో దాదాపు 40 మిల్లీమీటరల వర్షపాతం నమోదైంది. ఇక సైదాబాద్‌, అస్మాన్‌ ఘడ్‌ లో దాదాపుగా 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అంబర్‌ పేట్‌ లో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  అటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనూ భారీ వర్షాలు కురిశాయి. శేరిలింగంపల్లి, మాదాపూర్‌ లో 25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, బాలానగర్‌, బేగంపేట్‌ లో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నం, హయత్‌ నగర్‌, గచ్చిబౌలి, చందానగర్‌, మియాపూర్‌తో పాటు కీసర, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, కూకట్‌ పల్లి, సూరారంలోనూ వర్షం పడింది.

 అటు యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోనూ  భారీ వర్షాలు పడ్డాయి. చౌటుప్పల్‌ మండలం తో పాటు మిర్యాలగూడ, హుజూర్‌ నగర్‌ పట్టణాలలోనూ భారీ వర్షాలు కురిశాయి.

జయశంకర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. మహదేవ్‌ పూర్‌, ములుగు, వెంకటాపూరం, చిట్యాల మండలాల పరిధిలో మోస్తరు వర్షం కురిసింది. గోవిందరావు పేట మండలంతో పాటు కన్నాయిగూడెం మండల పరిధిలోనూ వర్షాలు పడ్డాయి. భూపాలపల్లి పట్టణంలోనూ భారీ వర్షం కురిసింది

మహబూబాబాద్‌ జిల్లాలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. డోర్నకల్‌, కురవి, మరిపెడ, చిన్నగూడూరు, దంతాపల్లి మండలాల్లో చిరుజల్లులు  కురిశాయి. మణుగూరుతో పాటు ఖమ్మం జిల్లా  పరిధిలోనూ వర్షాలు కురిశాయి.   మహబూబాబాద్‌, కేసముద్రం, నెల్లికుదురు, తొర్రూర్‌ మండలాల్లోనూ వర్షాలు జోరుగా పడ్డాయి.

ఇక వరంగల్ అర్బన్‌ జిల్లా పరిధిలోని హన్మకొండలో వర్షం పడుతుంది. వరంగల్‌ లో ముసురు వానతో ఇబ్బందలు తలెత్తుతున్నాయి. అటు మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోనూ వర్షాలు కురిశాయి.  కరీంనగర్‌ టౌన్‌లో మోస్తరు వానపడింది. అటు సిద్ధిపేట మండలంలోని పలు గ్రామాల్లోనూ వర్షాలు భారీగా కురిశాయి. ఇక సంగారెడ్డి పట్టణంలోనూ వర్షం పడ్డది.