రాష్ట్రంలో తీరనున్నపార్కింగ్ సమస్య

రానురాను రాష్ట్రంలో పార్కింగ్ సమస్య తీవ్రమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాహనాలకు తోడు.. రోజుకురోజుకు రోడ్డెక్కే వాహనాల సంఖ్య పెరుగుతున్నది. దీంతో వాహనాలు నిలిపేందుకు చోటు లేక పార్కింగ్‌ సమస్య తీవ్రమవుతున్నది. ముఖ్యంగా  హైదరాబాద్ లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అటు మిగితా నగరాలు, పట్టణాల్లోనూ సమస్య తీవ్రత అంతే ఉంది. ఐతే త్వరలోనే రాష్ట్రంలో పార్కింగ్ సమస్యలు తీరిపోనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. నూతన పార్కింగ్ పాలసీని తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన  జీవోను కూడా సర్కారు విడుదల చేసింది.

 ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణ జనాభా 39 శాతం దాకా ఉన్నది. ప్రజల్లో ఆర్థిక స్థోమత, అవసరాలు పెరుగుతుండటంతో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. 2014-15నాటికి రాష్ట్రంలో 78.4 లక్షల వాహనాలు ఉన్నాయి. నిత్యం 1,800 కొత్త  వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రోజుకు 700 వాహనాలు రోడ్ల మీదికి వస్తున్నాయి. దీంతో పార్కింగ్ సమస్య తీవ్రమవుతున్నది. నగరంలో పార్కింగ్ సదుపాయాలు లేక వాహనదారులు రోడ్లమీద అస్తవ్యస్తంగా నిలపాల్సిన దుస్థితి నెలకొన్నది. ఐతే ఏటా పెరుగుతున్న వాహనాలకు సరిపడా పార్కింగ్ వసతులను కల్పించడానికి 2006లో జీవో నం.86.. 2012లో జీవో నం.168 తెచ్చారు. అవి సమస్యను తాత్కాలికంగా కొంత మేరకు పరిష్కరించగలిగాయి. కానీ నగరవాసులు, ముఖ్యంగా గ్రేటర్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఐతే పార్కింగ్ కష్టాలకు చరమగీతం పాడటానికి ఈసారి ప్రభుత్వం పార్కింగ్ పాలసీని రూపొందించింది. పురపాలకశాఖ ప్రత్యేకంగా పార్కింగ్ పాలసీకి రూపకల్పన చేసింది. పాలసీని విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం స్థానిక సంస్థలకు కొన్ని లక్ష్యాలను నిర్దేశించింది. యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, స్థానిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పోలీస్, ట్రాఫిక్, ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ వంటివి ఈ పాలసీని పక్కాగా అమలు చేయడంలో తమవంతు పాత్ర పోషించక తప్పదు. ఇందుకోసం ప్రత్యేకంగా పార్కింగ్ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

 నూతన పార్కింగ్ పాలసీ పూర్తిస్థాయిలో అమలైతే అక్రమ పార్కింగ్‌ను నిరోధించడంతోపాటు ట్రాఫిక్‌లో సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు. పాదచారులు సురక్షితంగా వెళ్లవచ్చు. 108 వంటి వాహనాలు సులువుగా రాకపోకలను సాగించవచ్చు. ప్రజారవాణా సౌకర్యాలను పార్కింగ్ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. ఆధునిక పరిజ్ఞానంతో పార్కింగ్ వ్యవస్థను పక్కాగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది. సోమవారం విడుదల చేసిన కొత్త పార్కింగ్ పాలసీతో పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం అవుతున్నది.