రామ మందిరం కోసం అయోధ్య‌కు రాళ్లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌  అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈమేరకు  మూడు ట్ర‌క్కుల్లో రాళ్లు అక్క‌డ‌కు చేరుకున్నాయి. రామ్ జ‌న్మ‌భూమి న్యాస్ ప్రాంతంలో ఈ రాళ్ల‌ను దించారు. రామ్‌సేవ‌క్‌పుర‌మ్ స‌మీపంలో వీహెచ్‌పీ వ‌ర్క్‌పాష్ ఉంది. అక్కడే ఆల‌యానికి కావాల్సిన రాళ్ల‌ను చెక్కుతున్నారు. దానికి స‌మీపంలోనే తాజాగా వ‌చ్చిన రాళ్ల‌ను ఏర్పాటు చేశారు. 2000 క్యూబిక్ ఫీట్లు ఉండే రాళ్లను రామ‌భ‌క్తులు పంపిన‌ట్లు వీహెచ్‌పీ ప్ర‌తినిధి శ‌ర‌ద్ శ‌ర్మ తెలిపారు. డ‌బ్బుల‌కు బ‌దులుగా రాళ్లు దానం చేయాల‌ని కోర‌డంతో రాజ‌స్థాన్‌కు చెందిన భ‌ర‌త్‌పూర్ సంస్థ ఈ రాళ్లను పంపించింది. గ‌తంలో రాష్ట్రాన్ని పాలించిన స‌మాజ్‌వాదీ పార్టీ ఆ రాళ్ల‌ను తీసుకువ‌చ్చేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని వీహెచ్‌పీ పేర్కొన్న‌ది. రామ జ‌న్మ‌భూమి నిర్మాణం కోసం కావాల్సిన రాళ్లను రామ్ జ‌న్మ‌భూమి న్యాస్ ప్రాంతంలో చెక్కుతున్నారు. 1990 నుంచి ఇప్ప‌టివర‌కు సుమారు ల‌క్ష క్యూబిక్ ఫీట్ల రాళ్ల‌ను కొనుగోలు చేశారు. వివాదాద‌స్ప‌ద రామ్ జ‌న్మ‌భూమి ప్రాంతంలో సుమారు 268 ఫీట్ల పొడుగు, 140 ఫీట్ల వెడ‌ల్పుతో, 128 ఫీట్ల ఎత్తులో రామ‌జ‌న్మ‌భూమిని నిర్మించాల‌ని రామ‌జ‌న్మ‌భూమి న్యాస్ భావిస్తున్న‌ది.