రాంనాథ్ కోవింద్ కు టీఆర్ఎస్ తరపున సంపూర్ణ మద్దతు

ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన రాంనాథ్ కోవింద్ కు హైదరాబాద్ లో అపూర్వ స్వాగతం లభించింది. జలవిహార్ లో గులాబీదళం ఆయనకు ఘనస్వాగతం పలికింది. పార్టీ తరపున సీఎం కేసీఆర్ స్వయంగా ఆయనకు గ్రాండ్ వెల్ కం చెప్పారు. పలువురు కేంద్ర, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ కు టీఆర్ఎస్ తరపున సంపూర్ణ మద్దతు పలుకుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయనకు ఘనస్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు.  ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చామన్నారు. త్వరలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలవబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నామని వివరించారు. జీడీపీ వృద్ధిరేటులో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామన్న సీఎం.. రెండేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి మొద‌టి ర్యాంక్ వ‌స్తోంద‌ని అన్నారు.

రాంనాథ్ కోవింద్ కు సంపూర్ణ మద్దతు పలికిన సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు  ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించగానే మద్దతిచ్చిన తొలి ఎన్డీయేతర పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారాయన. నోట్లరద్దు, జీఎస్టీకి సపోర్ట్ తెలిపిన సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. వివాదరహితుడిగా పేరున్న రాంనాథ్ కోవింద్ విజయం ఖాయమని వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు.తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రపతి అభ్యర్థి రాంనాథ్ కోవింద్. తనకు ఘనస్వాగతం లభించడంపై ఆనందం వ్యక్తం చేశారాయన. తన కోసం హిందీలో ప్రసంగించిన సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు.

అంతకుముందు టీఆర్ఎస్ తరపున ఎంపీ కె.కేశవరావు స్వాగత వచనాలు పలకగా… మరో ఎంపీ జితేందర్ రెడ్డి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. చివరన  సీఎం కేసీఆర్..  రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ కు శాలువా కప్పి జ్ఞాపికను బహుకరించారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, ఇతర నేతలను కూడా శాలువాలతో సత్కరించారు.