మోదీ ప్రభుత్వంపై తగ్గని విశ్వాసం

ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంతో ప్రభుత్వాలు అభాసుపాలవుతున్న తరుణంలో భారత్‌లో మాత్రం 73% మంది ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విశ్వాసాన్ని కలిగివున్నారు. ప్రభుత్వం పట్ల దేశ ప్రజల నమ్మకంలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, అన్నింటికీ ఆధార్‌.. లాంటి భారీ సంస్కరణలు తీసుకొచ్చిన తరుణంలోనూ మోదీ సర్కారు ప్రజల నమ్మకంలో మొదటి ఐదు స్థానాల్లో నిలవడం విశేషం. ప్రజల నమ్మకంలో 80, 79 శాతాలతో మొదటి రెండు స్థానాల్లో స్విట్జర్లాండ్‌, ఇండోనేషియాలు ఉన్నాయి. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సుపరిపాలనకు సంబంధించిన 200 ఇండికేటర్లను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులను నిర్ధారించారు. 2007లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం అలముకొన్నపుడూ ఓఈసీడీ ఇలాంటి ర్యాంకింగ్‌లు ఇచ్చింది. తాజా ర్యాంకింగ్‌లో అగ్రరాజ్యం అమెరికాలోని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం కేవలం 30% మంది ప్రజల నమ్మకంతో అట్టడుగు దేశాల సరసన చేరింది. బ్రెగ్జిట్‌ సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌ కూడా 41%తో కింది స్థానంలోనే ఉంది. జర్మనీ, రష్యాలు 58, 55 శాతాలతో తొలి ఐదు స్థానాల్లో చోటు సంపాదించాయి. గ్రీస్‌ 13% ప్రజాదరణతో అట్టగుడున నిలిచింది.