మోత మోగనున్న ఫోన్ బిల్లులు

జీఎస్టీ అమలుతో మొబైల్ సేవలు మరింత భారం కానున్నాయి. పోస్ట్‌పెయిడ్ బిల్లులపై పన్ను భారం 15 శాతం నుంచి 18 శాతానికి చేరుకుంది. ప్రీపెయిడ్ కస్టమర్లకు రీచార్జ్‌లపై లభించే టాక్‌టైం తగ్గనుంది. ఉదాహరణకు.. ఇప్పటివరకు ప్రీపెయిడ్ కస్టమర్లు రూ.100 రీచార్జ్‌పై రూ.83 విలువైన టాక్‌టైం లభించేంది. ఇకపై రూ.80 టాక్‌టైం లభించనుంది. ఫోన్ సేవలపై పన్ను భారం పెరుగడమే ఇందుకు కారణం. ఇక పోస్ట్‌పెయిడ్ సేవల విషయానికొస్తే.. ఇప్పటివరకు రూ.1000 వినియోగంపై 15 శాతం సర్వీస్ ట్యాక్స్‌తో కలిపి రూ.1,150 కట్టాల్సి వచ్చేది. జీఎస్టీ హయాంలో పన్ను భారం మరో 3 శాతం పెరిగిన కారణంగా రూ.1,180 చెల్లించాల్సి వస్తుంది. అయితే, పెరిగిన పన్ను భారంలో కొంత మొత్తాన్నైనా టెలికం కంపెనీలు భరిస్తాయా? లేదంటే కస్టమర్లపైకే బదిలీ చేస్తాయా? అనేది చూడాలి. ఫోన్ బిల్లుతోపాటు విద్యుత్ చార్జీలు, ఇతర యుటిలిటీ బిల్లులపైనా పన్ను భారం పెరుగనుంది.