మోడీ, జిన్ పింగ్ చర్చలు

జర్మనీలోని హాంబర్గ్ లో ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ కలుసుకున్నారు. ఇరు దేశాలకు సంబంధించి పలు అంశాలపై కాసేపు చర్చించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. జీ-20 దేశాల సమావేశాల్లో పాల్గొనేందుకు వీరిద్దరు హాంబర్గ్ వచ్చారు. ఈ సమావేశాల విరామ సమయంలో బ్రిక్స్ దేశాల నేతల ఇన్ ఫార్మల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడి, జిన్ పింగ్ పలు అంశాలపై చర్చించారు.

ప్రస్తుతం భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త వాతావారణం నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల అధినేతల మధ్య చర్చలు జరగటం విశేషం. భారత ప్రధాని మోడీతో సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు గురువారం చైనా ప్రకటించినప్పటికీ… ఇరు దేశాల అధినేతలు కలుసుకొని మాట్లాడుకున్నారు. దీంతో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.