ముగిసిన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్

రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ ముగిసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మొత్తం 32 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ భవన్‌ సహా అన్ని రాష్ట్రాల శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఓటింగ్‌ కోసం సిద్ధం చేశారు. పార్లమెంటులో మొదటి ఓటు వేసి ప్రధాని మోడీ పోలింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ అనంతరం ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అన్ని పార్టీల ఎంపీలు ఓటు వేసేందుకు రావటంతో పార్లమెంట్‌ లోని ఓటింగ్ కేంద్రం కళకళలాడింది. బీజేపీ అగ్రనేత అద్వానీ, కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సోనియాగాంధీ, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సహా అన్ని పార్టీల ఎంపీలు ఓట్లు వేశారు. ఈ సందర్భంగా పార్టీలకు సంబంధం లేకుండా ఎంపీలు ఒకరినొకరు పలకరించుకుంటూ సరదాగా గడిపారు.

అటు అన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలి ఓటు వేసి ఓటింగ్ పక్రియను ప్రారంభించారు. రాష్ట్రాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరిగింది. ఐతే, కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఓటింగ్‌ ప్రక్రియలో పొరపాట్లు చేశారు. దీంతో ఆ ఓట్లు చెల్లకపోవచ్చని తెలుస్తోంది. విదేశాల్లో ఉన్నవారు, అనారోగ్య కారణాలతో కొందరు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. దాదాపు 44 మంది లోక్‌ సభ, 14 మంది రాజ్యసభ సభ్యులకు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం ఇచ్చింది. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఆయా ప్రాంతాల్లో ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వగా మరికొంత మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటులో ఓటు వేసేందుకు అనుమతిచ్చారు.

ఎన్డీఎ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ బరిలో నిలవగా, ప్రతిపక్షాల నుంచి మీరాకుమార్‌ పోటీలో నిలిచారు. పార్టీలు ఏ అభ్యర్థికి మద్దతిచ్చినప్పటికీ ఈ ఎన్నికల్లో విప్‌ మాత్రం జారీ చేసే అవకాశం లేదు. దీంతో ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్ ఎంపీలను, ఎమ్మెల్యేలను కోరారు. మొదటి నుంచి ప్రతిపక్షాల అభ్యర్థికి ఎన్సీపీ మద్దతు ప్రకటించినప్పటికీ చివరి క్షణంలో ఎన్డీఏ అభ్యర్థికే జై కొట్టారు. అటు తృణమూల్ కాంగ్రెస్ సైతం ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతిచ్చినప్పటికీ ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీంతో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ కు మేలు జరిగింది.

మొత్తం ఓట్ల విలువ 10 లక్షల 98 వేల 903 ఉండగా ఇందులో సగం అంటే.. దాదాపు 5 లక్షల 50 వేల ఓట్లు రాష్ట్రపతిగా ఎన్నిక కావటానికి అవసరం. ఐతే, ఎన్డీఏ పక్షాలకు 13 వేల ఓట్లు మాత్రమే తక్కువగా ఉన్నప్పటికీ టి.ఆర్.ఎస్, వై.ఎస్‌.ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే లాంటి పార్టీలు మద్దతివ్వటంతో రామ్‌ నాథ్ కోవింద్ గెలుపు లాంఛనమేనని తెలుస్తోంది. ఈ నెల 20 న ఎన్నిక ఫలితాలు వెల్లడించనున్నారు. కొత్త రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఈ నెల 25న ప్రమాణం చేయనున్నారు.