మీరాకుమార్ ను కాంగ్రెస్ బలిపశువును చేసింది

మీరాకుమార్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ఆమెను బలి పశువును చేసిందని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. మీరాకుమార్ కు టిఆర్ఎస్ మద్దతు ఇవ్వనందుకు కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన స్పందించారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సుమన్ మీడియాతో మాట్లాడారు. దళితులపై కాంగ్రెస్ కు అంత ప్రేమ ఉంటే ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించకముందే మీరాకుమార్ పేరుని ఎందుకు ప్రకటించలేదని సుమన్ నిలదీశారు. ఎన్డీఎలో లేని పార్టీలు కూడా కోవింద్ కు మద్దతు ప్రకటించిన తర్వాత మీరాకుమార్ ను ప్రకటించారని తప్పుపట్టారు.

మీరాకుమార్ ను హైదరాబాద్ పిలిచి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఎంపీ సుమన్ అన్నారు. విమానం మిస్సయితే నాలుగు గంటలపాటు ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నిరీక్షించాల్సి వచ్చిందన్నారు. అదే రాహుల్ గాంధీ అయితే ఇలా జరిగేదా అని ప్రశ్నించారు. మీరాకుమార్ ప్రచారం కోసం దేశమంతా తిరుగుతుంటే ప్రత్యేక విమానం ఎందుకు ఏర్పాటు చేయలేదని సుమన్ నిలదీశారు. దళితుల మీద కాంగ్రెస్ కు ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. మీరా కుమార్ అంటే తమకు కూడా ప్రత్యేక అభిమానం ఉందన్నారు. ఆడలేక మద్దెల ఓటిదన్నట్టు కాంగ్రెస్ దిగజారుడు రాజకీయం చేస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఎ అభ్యర్థి రామనాథ్ కోవింద్ కు టిఆర్ఎస్ మద్దతు ఇవ్వడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టడాన్ని ఎంపీ సుమన్ ఖండించారు. కోవింద్ కు ఎందుకు మద్దతు ఇస్తున్నామో తాము ఇప్పటికే బహిరంగంగా చెప్పామన్నారు. కోవింద్ కేవలం దళితుడే కాదని, న్యాయ కోవిదుడు కూడా  అన్నారు. సీఎం కేసీఆర్ సూచనతోనే దళిత అభ్యర్థిని ఎంపిక చేసినట్టు ప్రధాని మోడీ స్వయంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రపతి ఎన్నికలో మద్దతుపై నిర్ణయం తీసుకునే అధికారం టిఆర్ఎస్ పీపీ, ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ కు ఇచ్చామని, అయినా సీఎం కేసీఆర్ మళ్లీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపి కోవింద్ కు మద్దతుపై నిర్ణయం తీసుకున్నారని సుమన్ వివరించారు.

సిబిఐ కేసులకు భయపడే ఎన్డీఎ అభ్యర్థికి టిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం బట్ట కాల్చి మీద వెయ్యడమేనని ఎంపీ సుమన్ అన్నారు. సిబిఐ కేసుల చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ నేతల సిబిఐ కేసుల చిట్టా విప్పమంటారా అని సవాల్ విసిరారు. నోరు ఉంది కదా అని కాంగ్రెస్ నేతలు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.

ఎన్డీఎలో లేని బీజేడీ, జేడీ యు, అన్నా డీఎంకే లాంటి పార్టీలు కూడా టిఆర్ఎస్ తరహాలోనే కోవింద్ కు మద్దతు ఇస్తున్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలియదా అని సుమన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తో కలిసి బీహార్ లో ప్రభుత్వం నడుపుతున్న నితీష్ కుమార్.. మీరా కుమార్ కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ అవగాహన లేమితో క్రాస్ ఓటింగ్ గురించి మాట్లాడుతున్నారని, టిఆర్ఎస్ ఓట్లన్నీ కోవింద్ కే పడతాయని స్పష్టం చేశారు. కోదండ రామ్ పై స్పందిస్తూ… ఆయన కోదండ రాంగ్ అని ఎంపీ సుమన్ ఎద్దేవా చేశారు.