మిథాలి, జులన్ లకు సీఎం కేసీఆర్ అభినందన

మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా, 6వేలు పరుగులు సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డులు నెలకొల్పిన హైదరాబాద్ క్రికెటర్ మిథాలీ రాజ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ మేరకు ఆమెకు అభినందన సందేశం పంపారు. భారత జట్టు సారథిగా, వ్యక్తిగతంగా మిథాలీ రాజ్ మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా మిథాలీరాజ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా జులన్ గోస్వామి.. ఇద్దరూ భారతీయులే కావడం గర్వంగా ఉందని సిఎం అన్నారు.

గతంలో టెస్టు క్రికెట్లో రికార్డ్ సాధించిన గవాస్కర్ – కపిల్ దేవ్ కూడా ఇలా ఒకేసారి అగ్రగాములుగా నిలిచిన సంఘటనను ఈ ఇద్దరు అమ్మాయిలు పునరావృతం చేశారని సిఎం గుర్తుచేశారు. వుమెన్ వరల్డ్ కప్ లో మిథాలీ రాజ్ నాయకత్వంలో భారతజట్టు ఘన విజయం సాధించాలని సిఎం ఆకాంక్ష వ్యక్తం చేశారు. క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్ లాంటి క్రీడల్లో హైదరాబాద్ అమ్మాయిలు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ టైటిళ్లు గెలవడం, రికార్డులు నెలకొల్పడం ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయకమని సిఎం అభిప్రాయపడ్డారు.