మరో ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు

డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ డొంక కదులుతోంది. ఎక్సైజ్ శాఖ లిస్టులో మరికొంతమంది సినీహీరోలు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మరో ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో, డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 16 మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చారు. వారంతా ఈ నెల 19 నుంచి 22 లోపు విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ శాఖ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వాడే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. తెలంగాణ నుంచి డ్రగ్స్ ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రభుత్వం మద్దతుతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన నిందితుల కాల్ డేటా ఆధారంగా వారి నుంచి డ్రగ్స్ తీసుకునే వారి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. కెల్విన్ ముఠాతో మాట్లాడిన వారి వివరాలు తీసుకుంటున్నామని తెలిపారు.

విద్యార్థులు డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అకున్ సబర్వాల్ చెప్పారు. డ్రగ్స్ వాడే విద్యార్థులున్న 26 స్కూళ్లు, 27 కాలేజీల యాజమాన్యాలకు సమాచారం ఇచ్చామని తెలిపారు. వారందరి ఫోన్ నంబర్లు తమ దగ్గర ఉన్నాయని, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక అధికారిని నియమించామని వెల్లడించారు.