భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు, దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. నగరంలో డ్రగ్స్‌ మూలాలను ఏరిపారేయాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. పూర్తిస్థాయి దర్యాప్తుకు తక్షణమే సిట్‌ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే డ్రగ్స్‌ పంపిణీదారులు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు స్కూల్‌, కాలేజీ విద్యార‍్థులు డ్రగ్స్‌ బారినపడటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో డ్రగ్స్‌ ఆనవాళ్లు కనిపించకూడదని, కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరోవైపు, డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. కాగా  నిందితుల విచారణలో అనేక సంచలనాత్మక అంశాలు వెలుగుచూశాయి. అనేక మంది బడా ఉద్యోగులు, సినీ నిర్మాతలు, పలు కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు డ్రగ్స్‌ సరఫరాదారులకు కస్టమర్లుగా ఉండటం అధికారులను విస్తుబోయేలా చేసింది. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆరుగురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

హైదరాబాద్‌లో ల‌క్ష‌ల విలువ చేసే అత్యంత ప్ర‌మాద‌కర‌మైన డ్ర‌గ్స్‌ను సరఫరా చేసే ముఠా గుట్టు ర‌ట్టు కావ‌డంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్ట‌రేట్ అలెర్ట్ అయింది. కేసు ప్రాథ‌మిక ద‌శ‌లోనే విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి రావ‌డంతో అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప‌ట్టుబ‌డిన ప్ర‌ధాన సూత్ర‌దారి కెల్విన్ మిశ్రాతో పాటు మ‌హమ్మ‌ద్ అబ్దుల్ వాహబ్‌, మహమ్మ‌ద్ అబ్దుల్ ఖుదూష్‌ను విచారించడంతో ఆస‌క్తి క‌ర విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు వాడిన ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా 23 మంది క‌స్ట‌మ‌ర్లను గుర్తించారు అధికారులు. వీరిలో మైన‌ర్లు సైతం ఉన్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం చేశారు.

కెల్విన్ మిశ్రా కీల‌కంగా డ్ర‌గ్ రాకెట్ లో ఉన్న‌ట్లు అధికారులు ఇప్ప‌టికే నిర్ధార‌ణ‌కు వచ్చారు. బోయిన్ ప‌ల్లిలోని కెల్విన్ ఇంటి నుంచే 700 యూనిట్ల ఎల్ఎస్డీ డ్ర‌గ్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. దీని విలువ ఒక్క చుక్క ఖ‌రీదు 4 వేలు ప‌లుకుతుంద‌ని అధికారులు అంచ‌నాకు వచ్చారు. ముఠా స‌భ్యులు గ‌త కొంతకాలంగా అమెరికాలోని చికాగో నుంచి భారీ మొత్తంలో న‌గ‌‌రానికి మాద‌క ద్ర‌వ్యాలు  తెచ్చి స‌ర‌ఫ‌రా చేసి సొమ్ము చేసుకున్న‌ట్లు గుర్తించారు. స్టేష‌న‌రీ ప‌రిక‌రాల మాటున డ్ర‌గ్స్‌ న‌గ‌రానికి వ‌చ్చి చేరినట్లు తెలుస్తోంది.

ఎక్సైజ్ అధికారుల విచార‌ణ‌లో ముగ్గురు నిందితులు కీల‌క వివ‌రాలు వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. పలు ఎమ్మెన్సీ కం‌పెనీ ఉద్యోగులు,ఇంటర్ నేషనల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన పలువురు విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా అయినట్లు ప్రాథమికంగా నిర్థారణ అయింది. మైనర్లను సైతం ఈ ముఠా డ్రగ్స్ వ్యాపారంలోకి లాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం 9 ఇంజనీరింగ్ కాలేజీలు, 4 ఇంటర్నేషనల్‌ స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు ఎక్సైజ్ అధికారులు.

పలువురు వీఐపీల కుమారులు డ్రగ్స్‌కు బానిసలయ్యారనే సమాచారం ఉండటంతో.. నిగ్గుతేల్చేందుకు వారి వ్యవహారశైలి తెలుసుకోవాలనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక సినీ పరిశ్రమలోని ఓ బడా నిర్మాత కూడా డ్రగ్స్‌ కోసం కెల్విన్ మిశ్రాతో వాట్సప్‌ ద్వారా సంప్రదించడంపై ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ నిర్మాతను అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం.

డ్రగ్స్ ముఠాకు సంబంధించిన మొత్తం చిట్టా డ్రగ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  డైరెక్టరేట్‌ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డ్రగ్‌ రాకెట్ కేసు సమగ్ర విచారణ కోసం స్పెషల్‌ ఇన్వెస్ట్ గేషన్ టీంను ఏర్పాటు చేశారు. ప్రధానంగా డ్రగ్స్‌ను ఎక్కడినుంచి తీసుకువచ్చారు. ఎవరెవరికి సరఫరా చేశారనే అంశాలను సిట్ నిగ్గుతేల్చనుంది. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సిట్ టీం విచారణ చేపడుతోంది.

డ్రగ్స్ ముఠాపై బాలానగర్‌, చార్మినార్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడు కెల్విన్‌పై బాలానగర్‌ పీఎస్‌లో, వాహబ్‌, ఖుదూష్‌లపై చార్మినార్ పీఎస్‌లో కేసులు నమోదు చేశారు. మొత్తానికి ఎక్సైజ్‌ శాఖ అధికారులు, టాస్క్‌ ఫోర్స్ పోలీసులు సమన్వయంతో పెద్ద డ్రగ్స్ రాకెట్‌ను చేధించడంతో చాలామంది యువత భవిష్యత్తును కాపాడినట్లైంది.