భవిష్యత్ తరాల కోసం మొక్కలు పెంచుదాం

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, పెంచాలని మంత్రి కేటీఆర్ కోరారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి అదేనని చెప్పారు. హైదరాబాద్ హైదర్ నగర్ డివిజన్ హెచ్ఎంటి శాతవాహన కాలనీలో హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ పరిసరాల్లో మొక్కలు నాటారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కేవలం ప్రభుత్వం, అధికారుల బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు.

ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ జానకి రామరాజు, జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, జలమండలి ఎండి దానకిషోర్, కాలనీ వాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కాలనీవాసులతో మొక్కలు నాటే ప్రతిజ్ఞ చేయించిన మంత్రి కేటీఆర్.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించారు.

హైదరాబాద్ లో 25 చెరువులను రూ.400 కోట్ల ఖర్చుతో సుందరీకరిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎక్కడికక్కడ చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. తాను దత్తత తీసుకున్న హైదర్ నగర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరు చేశామన్న మంత్రి కేటీఆర్, ఆ నిధులతో చేపట్టిన పనులను వివరించారు. హైదర్ నగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ సమర్థత వల్ల ఎండాకాలం కూడా నిరంతరం కరెంట్, నీరు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.