బెంజ్ నుంచి న్యూ మోడల్!

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయంగా ఎస్‌యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సరికొత్త జీఎల్‌ఏ క్లాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎస్టీ కంటే ముందు ప్రవేశపెట్టిన కారు ధరతో పోలిస్తే నాలుగు శాతం తక్కువకు ఈ కారును విక్రయిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. రెండు లీటర్ల పెట్రోల్ ఇంజిన్, ఐదుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన జీఎల్‌ఏ క్లాస్ డీ 200 వాహనం రూ.30.65 లక్షల నుంచి రూ.36.75 లక్షల మధ్యలో లభించనున్నదని మెర్సిడెజ్-బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మిచాల్ జోప్ తెలిపారు. జీఎస్టీ అనుగుణంగా రాష్ర్టాల మధ్య ధరల్లో మార్పులుంటాయని ఆయన వెల్లడించారు. గత మోడళ్లతో పోలిస్తే ఈ మోడల్‌ను నూతన టెక్నాలజీతో రూపొందించినట్లు, ముఖ్యంగా డిజైనింగ్, శక్తివంతమైనదిగా రూపొందించినట్లు ఆయన చెప్పారు. జీఎల్‌ఏ 200, జీఎల్‌ఏ 200 డీ, జీఎల్‌ఏ 220 డీ 4 మ్యాటిక్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇప్పటికే ఎన్‌జీసీ రకానికి చెందిన 13 వేల కార్లు దేశీయ రోడ్లపై పరుగెడుతున్నాయి. పుణెకు సమీపంలో ఉన్న ఛకాన్ ప్లాంట్లో తయారైన ఏడో మోడల్ ఇది అని ఆయన తెలిపారు. పెట్రోల్ వెర్షన్‌పై రూ.49 వేల వరకు మైలేజీ వ్యారెంటీ సదుపాయం కల్పించిన సంస్థ..డీజిల్ రకంపై రూ.63 వేలు కల్పించినట్లు జోప్ తెలిపారు.