బురిడీ బాబా ముఠా అరెస్ట్

కనక వర్షం కురిపిస్తా, సర్కార్ కొలువు ఇప్పిస్తానని మోసం చేస్తున్న బురిడీ బాబా దాదుబంజన్ విఠల్ ను హైదరాబాద్ గోపాలపురం పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అతనితోపాటు ఆయుర్వేద డాక్టర్ పద్మారెడ్డి, అతని మిత్రుడు నిరంజన్ లను కూడా అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. వీరి నుంచి రూ.16 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన విఠల్ పై ఇప్పటికే రెండు మర్డర్ కేసులు, ఓ కిడ్నాప్ కేసు, అక్రమ ఆయుధాల కేసు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

మీ ఇంట్లో అశాంతితో ఉన్నారంటూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూజలు చేసే విఠల్.. ఆ తర్వాత డబ్బులు గుంజడం మొదలుపెడతాడు. మొదట పూజ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరికి తెలియకుండా ఓ తాయత్తు పెట్టి, రెండోసారి పూజ చేసినప్పుడు ఆ తాయత్తు తీసి మీకు దేవుడు ఇచ్చాడంటూ నమ్మబలుకుతాడు. ఇలా అనేకమంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశాడని డీసీపీ సుమతి తెలిపారు. ఇన్ కం ట్యాక్స్, జెన్కో లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కొందరి దగ్గర రూ.42 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బురిడీ బాబా ముఠాను అరెస్ట్ చేశారు.