బాల నేరస్థుల్లో మార్పు తేవాలి

రాష్ట్రంలో జువెనల్ జస్టిస్-2015 అమలుపై సమీక్ష నిర్వహించింది ఉన్నత న్యాయస్థానం. హైకోర్ట్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ నేతృత్వంలో హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన సెమినార్ లో డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పోలీసు ఉన్నతాధికారులు, జడ్జీలు పాల్గొన్నారు. ఈ సెమినార్ లో జువెనల్ జస్టిస్ యాక్ట్ అమలుపై పోలీసులకు దిశానిర్ధేశం చేశారు హైకోర్ట్ చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాధన్.

తెలిసీ తెలియని వయస్సులో నేరాలకు పాల్పడుతున్నారు కొందరు మైనర్లు. అలాంటి మైనర్లపై జువెనల్ జస్టిస్ యాక్ట్ కింద కోర్టులో కేసుల విచారణ జరుగుతుంది. దీంతో పాటు మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు వారి జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీస్ స్టేషన్ నుండి కోర్టులో న్యాయవిచారణ జరిగే వరకు అటు మైనర్ నేరస్థులు, ఇటు బాధిత చిన్నారులపై పరిస్థితుల ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇలాంటి వారిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు తీసుకువచ్చిన జువెనల్ జస్టిస్ యాక్ట్-2015 అమలు, పోలీసుల పనితీరుపై ఈ సెమినార్ లో చర్చించారు.

దేశంలో ఎక్కువ మంది చిన్నారులు తమ ఆర్ధిక, మానసిక పరిస్థితులతో పాటు పరిసరాల ప్రభావంతో నేరాల బాట పడుతున్నారని అన్నారు సీజే రమేష్ రంగనాథన్. దీంతో పాటు లైంగిక దాడులకు గురైన బాధిత చిన్నారులకు యాక్ట్ లో పొందుపరిచిన విధంగా పోలీసులు సహాయ సహకారాలను అందించాలని కోరారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారం ఇలాంటి కేసుల్లో ఎక్కువగా 16 నుండి 18 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లే ఉన్నారని గుర్తు చేశారు. దీంతో పాటు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ లతో బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్న రాష్ట్ర పోలీసులను అభినందించారు సీజే రమేష్ రంగనాధన్.

ఈ సెమినార్ లో యాక్ట్ అమలుపై న్యాయమూర్తులు ఇచ్చిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు… జువెనల్ జస్టిస్ యాక్ట్ 2015, పోక్సో యాక్టులను చట్టాలకు లోబడే అమలు చేస్తున్నామన్నారు. ఇలాంటి కేసుల్లో తమ దగ్గరకి వచ్చే మైనర్లకు, బాధితులకు యాక్టులో పొందుపరిచిన గైడ్ లైన్స్ ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఎమెన్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్, యునెసెఫ్ సభ్యులతో కలిసి బాధితులకు విద్య, వైద్యం, పునరావాసం లాంటి ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ అనురాగ్ శర్మ వివరించారు. ఇలాంటి కేసుల్లో తమ వద్దకు వచ్చే బాధితుల్లో మనోస్థైర్యం నిలిపే విధంగా భరోసా సెంటర్ లాంటి కేంద్రాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేసి వీడియో రికార్డింగ్ సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్షలు పడేలా కోర్టులో నిలబెడతామన్నారు డీజీపీ.