బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి

పాత ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో రాష్ట్రానికి మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ తనను కలిసిన తర్వాత కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునఃవిభజన చట్టంలో తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉందని కేంద్రమంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వం బయ్యారం స్టీల్ ప్లాంటుపై అభ్యంతరాలు తెలిపిందని, తాను కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. 10-15 రోజుల్లో టాస్క్ ఫోర్స్ నివేదిక వస్తుందని, ఆ తర్వాత హైదరాబాద్ లో సమీక్ష నిర్వహించి బయ్యారంలో స్టీల్ ప్లాంటుపై రాష్ట్రానికి మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.

కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ తో సమావేశం తర్వాత మంత్రి కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. ఏపీ పునఃవిభజన చట్టంలో పేర్కొన్నట్లుగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఒక్క బయ్యారం కాకపోతే, ఛత్తీస్ గఢ్ లోని బైలడిల్ల ప్రాంతాన్ని కలుపుకొని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరామని వెల్లడించారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడితే ఖమ్మం జిల్లాలోని ఎంతో మంది యువకులకు ఉపాధి దొరుకుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని ఆయన గుర్తుచేశారు.