ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ‘సీతారామ’ పనులు చేయండి

సీతారామ ప్రాజెక్టుని ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనులు వేగవంతం చేయాలన్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి ఈ సంవత్సరం పూర్తి ఆయకట్టుకు నీరివ్వాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్ లోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి హరీశ్ రావు జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు.

సింగూరు, ఘణపురం, కడెం, నీల్వాయి, మత్తడి వాగు, కొమురం భీమ్, గొల్లవాగు, నల్లవాగు ప్రాజెక్టుల నుంచి ఖరీఫ్ కు నీటి విడుదలకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఇందుకు గాను ఎస్ఆర్ఎస్పీ, నాగార్జున సాగర్, ఎఎంఆర్పీ, నిజాం సాగర్ తదితర ప్రాజెక్టుల పరిధిలో ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో రైతు అవగాహన సదస్సులు వెంటనే నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల డ్యాంల గేట్లను పటిష్టం చేయాలన్నారు.

నిజాంసాగర్ కింద గత ఏడాది సమర్థంగా సాగునీటి యాజమాన్యం జరిగిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. అదే స్ఫూర్తిని మిగతా ప్రాజెక్టులలోనూ కొనసాగించాలని కోరారు. ముఖ్యంగా సింగూరు, ఘణపూర్ ప్రాజెక్టులలో సాగునీటి యాజమాన్యం సమర్ధంగా చూడాలన్నారు. వరద కాలువ, దేవాదుల ప్రాజెక్టులలో పెండింగులో ఉన్న భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ ను కోరారు. ఎస్ఆర్ఎస్పి కాలువల్లో జంగిల్ క్లియరెన్స్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖరీఫ్ ఇరిగేషన్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకోవాలని, నీటి లభ్యతను బట్టి ఖరీఫ్ కు నీటిని విడుదల చేయాలని కోరారు.