ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలి రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు జరగలేదు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌ ఉండటంతో సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలను వాయిదా వేశారు. ఇటీవల మరణించిన లోక్ సభ సభ్యులు, మాజీ సభ్యులకు ఎంపీలు నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాసేపు మౌనం పాటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.

రాజ్యసభలోనూ ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు నివాళులు అర్పించారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, దర్శకుడు దాసరి నారాయణ రావు, కేంద్ర మంత్రి అనిల్ మాదవ్ దవే లకు నివాళులు అర్పించారు. సభ్యుల సేవలను స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ఎంపీల తరపున రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ సానుభూతి తెలిపారు.

పలు రాష్ట్రాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారికి, అమర్ నాథ్ యాత్రలో ఉగ్రదాడికి గురై మరణించిన వారికి ఉభయ సభల్లో నివాళులు అర్పించారు. అనంతరం ఉభయ సభలను వాయిదా వేశారు. మంగళవారం నుంచి సభ కార్యక్రమాలు సజావుగా సాగుతాయని అధికార పక్షం ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే నెల 11 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి.