ప్రధాని మోదీపై చైనా మీడియా ప్రశంసలు

భారత్ పేరెత్తితేనే విరుచుకుపడే చైనా మీడియా స్వరం మార్చింది. ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపించింది. భారత్‌లో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు అమోఘమని కీర్తించింది. జీఎస్‌టీ చాలా గొప్పదని, ఆ ఘనత మోదీకే దక్కుతుందని కొనియాడింది. జీఎస్టీ కారణంగా లో-కాస్ట్ తయారీ రంగం నెమ్మదిగా ఇండియాపై మరలుతుందని, ప్రపంచ మార్కెట్లోని తమ ఆధిపత్యాన్ని త్వరలోనే భారత్ భర్తీ చేసే అవకాశం ఉందని విస్పష్టంగా పేర్కొంది. భారత్ క్రమంగా తన సమస్యలను అధిగమిస్తుందని జోస్యం చెప్పింది. మేకిన్ ఇండియాకు జీఎస్‌టీ బూస్ట్‌లా ఉపయోగపడుతుందని పేర్కొంది. జీఎస్‌టీ రాష్ట్రాల పన్నుల్లో ఉన్న తేడాలు సమసిపోయానని వివరించింది. ఫలితంగా దేశమంతా ఒకే మార్కెట్ ఏర్పడుతుందని, దీనివల్ల దేశానికి మంచే జరుగుతుందని పేర్కొంది. జీఎస్టీ వల్ల భారత్‌కు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ‘గ్లోబల్ టైమ్స్’ తన కథనంలో వివరించింది. సిక్కిం సరిహద్దులో ప్రస్తుతం ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత్‌ను ప్రతిరోజూ విమర్శించడం, హెచ్చరించడమే పనిగా పెట్టుకున్న చైనా మీడియా అకస్మాత్తుగా భారత్‌ను పొగడ్తల్లో ముంచెత్తడం గమనార్హం. ఒకానొక దశలో భారత్‌తో యుద్ధం తప్పదని కూడా చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. భారత్ వెనక్కి తగ్గకుంటే 1962 నాటి పరిస్థితులను ఇండియా మళ్లీ ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే భారత్ అందుకు దీటుగా జవాబిచ్చింది.