ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం

సమైక్య రాష్ట్రంలో ధర్మపురి ప్రాంతం తాగునీళ్లకు, సాగునీళ్లకు నోచుకోలేదన్నారు మంత్రి ఈటెల రాజేందర్. పంట కాలువల్లో తుమ్మలు మొలిచిన దుస్థితి ఆనాడు ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక మూడేళ్లలోనే ప్రభుత్వం పంట పొలాలకు నీళ్లిచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమ పథకాలు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయని, ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని మంత్రి ఈటెల అన్నారు. అందుకోసం పలు పథకాలు ప్రవేశపెట్టారని, రైతులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు.

జగిత్యాల జిల్లాలో రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులు ప్రారంభించిన సందర్భంగా ధర్మపురిలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి ఈటెల మాట్లాడారు. ఈ సభలో మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు మాట్లాడారు.