పోలీస్ శాఖ లక్ష్యం కోటి మొక్కలు

మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షిoచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. మూడో విడత హరితహారం ప్రారంభం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహింపట్నం మండలం మంచాల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మామిడి మొక్కను నాటారు.

గత రెండు సంవత్సరాలుగా పోలీస్ శాఖ హరితహారం కార్యక్రమంలో కీలక పాత్ర వహిస్తోందని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందన్నారు. ఈ ఏడాది పోలీస్ శాఖ కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెటుకుందని ప్రకటించారు. హరితహారం కార్యక్రమం అమలుపై ప్రతి జిల్లా యూనిట్ అధికారి నుండి సమాచారం సేకరించి ఆన్ లైన్ లో పొందుపరుస్తామని, ప్రతి రోజు కార్యక్రమం అమలుపై యూనిట్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పోలీస్ శాఖకు కేటాయించిన లక్ష్యాన్ని స్థానిక ప్రజల సహకారంతో పూర్తి చేస్తామన్నారు.

ఇబ్రహింపట్నం నియోజక వర్గంలోని నాలుగు మండలాలలో దాదాపు 32 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు.

గత సంవత్సరం పోలీస్ శాఖ ద్వారా 20 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయిస్తే  95 లక్షల మొక్కలు నాటామని రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ డీజీ కృష్ణప్రసాద్ తెలిపారు.

కార్యక్రమం అనంతరం డీజీపీతో పాటు పోలీస్ ఉన్నత అధికారులు స్థానిక పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఆ తర్వాత డీజీపీ కార్యాలయ ఆవరణలో వెదురు మొక్కలను నాటారు. ఇంకుడుగుంతను ప్రారంభించారు.

ఈ కార్యక్రమాలలో అడిషనల్ డీజీలు గోపీకృష్ణ, అంజనీకుమార్, రవిగుప్తా, గోవింద్ సింగ్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండి మల్లా రెడ్డి, ఐజీలు శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్ర, అభిలాష, షికా గోయల్, సంజయ్ జైన్, స్టీఫెన్ రవీంద్ర, ఎఐజీ రమేష్, మంచాల ఎంపీపి జయమ్మ, జడ్పీటీసీ మహిపాల్ పాల్గొన్నారు