పోగొట్టుకున్న ఫోన్లు పనిచేయవు!

చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు పనిచేయకుండా చేసే నూతన వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. చోరీ చేసిన మొబైల్‌లో సిమ్ కార్డు లేదా ఐఎంఈఐ నంబర్‌ను మార్చినా ఆ ఫోన్ పనిచేయదు. ఈ నూతన వ్యవస్థను రూపొందించే పనిని ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించింది. పుణెలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కేంద్రంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పేరుతో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఇంజినీర్లు ఆరునెలలుగా పరీక్షిస్తున్నారు. నకిలీ ఐఎంఈఐ నంబర్లను, చోరీలను అడ్డుకునే లక్ష్యంతో నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ వ్యవస్థ వినియోగదారుల హక్కులను పరిరక్షించడంతోపాటు ప్రభుత్వ సంస్థలు చట్ట ప్రకారం జోక్యం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. సీఈఐఆర్ అన్ని మొబైల్ ఆపరేటర్ల వద్ద ఉన్న ఐఎంఈఐ డాటాబేస్‌తో అనుసంధానమై ఉంటుంది. సీఈఐఆర్ అన్ని నెట్‌వర్క్ ఆపరేటర్లకు కేంద్ర వ్యవస్థగా పనిచేస్తూ బ్లాక్ చేసిన మొబైల్ పరికరం సమాచారాన్ని అపరేటర్లకు అందిస్తుంది. తద్వారా ఆ పరికరం సిమ్‌కార్డు మార్చినా పనిచేయదు. ఫోన్ చోరీ అనేది ఆర్థిక నష్టమే కాకుండా వ్యక్తిగత జీవితానికి, జాతీయభద్రతకు ముడిపడిన అంశమైనందున ప్రభుత్వం గట్టిచర్యలు చేపడుతున్నది.