పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనం భారీగా పెంపు  

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న అధ్యాపకుల వేతనాలు భారీగా పెరిగాయి. పెరిగిన నూతన వేతనాలు 2017-18 విద్యాసంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి. వేతనాల్లో రూ.28,500 నుంచి రూ.40,270 వరకు పెరుగుదల ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో 435 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో 172 విడుదలచేశారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ను ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.