పాలమూరు పచ్చబడేదాక విశ్రమించం

ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన పాలమూరు పచ్చబడేదాకా టిఆర్ఎస్ ప్రభుత్వం విశ్రమించదని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. పాలమూరు జిల్లాలోనే పుట్టిన కొందరు ప్రాజెక్టులకు అడ్డుపడటం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. కోర్టుల్లో కేసులు వేసి అనేక ఆటంకాలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి తీరుతుందని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం.. బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణపేట మున్సిపాలిటీకి, నియోజకవర్గానికి భారీగా నిధులు ప్రకటించారు.

ఈ కార్యక్రమాలు, సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.