పారిశ్రామికవేత్తలకు విద్యుత్ శాఖ వరం

విద్యుత్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మరో వెసులుబాటు కల్పించింది. 650 వోల్టేజీకి పైబడి పరిశ్రమలు నెలకొల్పబోయే పారిశ్రామికవేత్తలు.. విద్యుత్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే బాధను తప్పించింది. ఇకపై విద్యుత్ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ ఆన్ లైన్ లోనే క్లియర్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన వెబ్ పోర్టల్ ను మంత్రి జగదీష్ రెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ రాజేందర్ నింజె ఆధ్వర్యంలో ఈ వెబ్ సైట్ ను రూపొందించారు. కేవలం 40 రోజుల వ్యవధిలో వెబ్ పోర్టల్ ను రూపొందించిన సిబ్బందిని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు.

టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ వెబ్ పోర్టల్ ఓ వరంగా మారనుంది. సులువుగా విద్యుత్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఉద్దేశించిన వెబ్ పోర్టల్ లో వినియోగదారుడి సందేహాలను నివృత్తి చేసుకుంనేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుదారుడు తాము పెట్టబోయే పరిశ్రమకు సంబంధించిన వివరాలతో పాటు సంబంధిత పత్రాలను ఆన్ లైన్ లో పొందుపర్చాలి. దరఖాస్తులోని లోటుపాట్లను సంబంధిత తనిఖీ అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. తరువాత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. అన్ని కరెక్టుగా ఉన్నాయని అధికారులు నిర్దారణకు వచ్చిన తరువాత.. సంబంధిత విద్యుత్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సరిగ్గా 14 రోజుల వ్యవధిలో వినియోగదారుడికి చేరేలా ఈ వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చారు. అటు తమ దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించారు.

విద్యుత్, సర్టిఫికెట్స్ క్లియరెన్స్ కు సంబంధించిన ఫీజు పేమెంట్స్ ను కూడా ఆన్ లైన్ లో  చెల్లించే విధంగా వెబ్ పోర్టల్ రూపొందించారు. ఈ మేరకు 650 వోల్టేజి పైబడి 11 కె.వి నుండి విద్యుత్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు పొందాలనుకునే పారిశ్రామికవేత్తలు http://tsseig.cgg.gov.in లో తమ దరఖాస్తులను పంపుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.