పరిశ్రమల శాఖ అధికారి ఇళ్లలో ఏసీబీ సోదాలు

పరిశ్రమల శాఖ రంగారెడ్డి-1,2, జీడిమెట్ల ఏరియాల డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ముక్కామల వెంకన్న ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్‌ మియాపూర్ లోని మదీనగూడ కృషి నగర్ లోని ఆయన ఇల్లు, ఆఫీసుతోపాటు.. నిజామాబాద్‌, సూర్యాపేట, మాసాబ్ ట్యాంక్ లోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. వెంకన్నకు భారీగా అక్రమాస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన పేరు మీద 15 ఆస్తులు, వాహనాలు, ఆయన అత్తగారి దగ్గర మరో 10 ఆస్తులు ఉన్నాయని ఏసీబీ డీఎస్పీ సిద్ధిఖీ వెల్లడించారు. అధికారిక అంచనాల ప్రకారం కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్టు గుర్తించారు. ఆయన ఇల్లు మార్కెట్ విలువ ప్రకారం సుమారు రెండున్నర కోట్లు ఉంటుందని చెప్పారు.