నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

ఒక్క సీసీ కెమెరా వంద మంది కానిస్టేబుళ్లతో సమానమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చన్నారు. జూబ్లీహిల్స్‌ లో ఏర్పాటు చేసిన 400 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. హైదరాబాద్‌ ను సేఫ్‌ అండ్‌ సెక్యూర్డ్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కృషి చేస్తోందని మహేందర్‌ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో నేరం చేయాలంటే నేరగాళ్లు బయపడాలని, ఇందుకోసమే లక్ష సీసీ కెమెరాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.

1960 నుంచి ఇప్పటివరకు భారతదేశంలోనే మంచి కాలనీగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ కాలనీ ఉందని సీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. 400 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన సొసైటీ సభ్యులందరిని అభినందించారు. నేరాలను తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వ చొరవ, కమ్యూనిటీ, దాతల సహాయం, ప్రజల సహకారం, భాగస్వామ్యంతో హైదరాబాద్ లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 4 కోట్ల రూపాయల ఖర్చుతో 400 సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ లోని 16 కిలోమీటర్ల పరిధిని ఇవి కవర్ చేస్తాయి.

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రసిడెంట్ నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.