నేడు విండీస్‌తో భారత్ ఐదో వన్డే

ఓవైపు సిరీస్‌పై గురిపెట్టిన భారత్.. మరోవైపు సిరీస్‌ను సమం చేయాలన్న లక్ష్యంతో వెస్టిండీస్.. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య కీలకమైన ఐదో వన్డేకు రంగం సిద్ధమైంది. అనూహ్య పరిణామాల మధ్య కరీబియన్ గడ్డపై అడుగుపెట్టిన భారత్ ఆరంభంలో అద్భుతంగా ఆడినా.. సిరీస్‌ను నెగ్గే మ్యాచ్ (నాలుగో వన్డే)లో అనూహ్యంగా చేతులెత్తేసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా కేవలం 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. దీంతో విండీస్ సరికొత్త ఉత్సాహంతో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని హోల్డర్‌సేన కృతనిశ్చయంతో ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది.

సిరీస్‌ను నిర్ణయించే మ్యాచ్ కావడంతో తుది జట్టులో మార్పులు చేస్తారని అందరూ భావిస్తున్నా కోహ్లీ ఆ దిశగా కసరత్తులు చేయడం లేదు. ఒకవేళ మార్పులు జరిగితే యువరాజ్, రిషబ్ పంత్‌లలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. మూడేండ్ల తర్వాత వన్డే మ్యాచ్ ఆడిన దినేశ్ కార్తీక్ విఫలంకావడం, కేదార్ జాదవ్‌కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా గాడిలో పడకపోవడంతో ఈ ఇద్దరిలో ఒకర్ని పక్కనబెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టాప్ ఆర్డర్‌లో రహానే నిలకడగా ఆడుతున్నా ధవన్, కోహ్లీ మెరువాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఒక్కరు కుదురుకున్నా పరుగుల వరద ఖాయం. మిడిలార్డర్‌పై స్పష్టత లేకపోయినా ధోనీ, హార్దిక్ మెరుగ్గా ఆడటం కలిసొచ్చే అంశం. అయితే నాలుగో వన్డేలో ఓటమితో మహీ ఫినిషింగ్‌పై సందేహాలు నెలకొన్నా దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. జడేజా మునుపటి ఫామ్‌ను చూపెట్టాలని భావిస్తున్నాడు. బౌలింగ్‌లో ఉమేశ్ ఆకట్టుకున్నా.. షమీ ప్రభావం కనిపించడం లేదు. పాండ్యా ఆల్‌రౌండర్ పాత్రకు తగిన న్యాయం చేస్తుండటం కలిసొచ్చే అంశం కాగా, కుల్దీప్ స్పిన్ మ్యాజిక్ చూపెడితే భారత్ సులువుగా గెలువొచ్చు.

మరోవైపు నాలుగో వన్డే గెలుపుతో విండీస్‌లో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. ఓపెనర్లు లెవీస్, కైల్ హోప్స్ మెరుపు ఆరంభాన్నిస్తారని ఆశిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో వచ్చే బ్యాట్స్‌మెన్ కనీసం డబుల్ డిజిట్ స్కోరు చేసినా భారత్ ముందు భారీ లక్ష్యం నిర్దేశించొచ్చు. కెప్టెన్ హోల్డర్ నేతృత్వంలోని బౌలింగ్ అటాక్ ఇప్పుడు గాడిలో పడింది. భారత బ్యాట్స్‌మెన్ ఇబ్బందులుపెట్టడంలో అందరూ సఫలీకృతమయ్యారు. ఇదే ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ చూపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత మ్యాచ్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని గెలుపుతో సిరీస్‌ను సమం చేయాలని మేనేజ్‌మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.