నేడు రాష్ట్రపతి ఎన్నిక

ఇవాళ జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల బ్యాలెట్ పేపరుపై తెలుగులో కూడా అభ్యర్థి పేరు ముద్రించారు. మొదట తెలుగులో ఆ తరువాత ఇంగ్లీష్‌లో రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. సునీల్ కుమార్ ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా వ్యవహరించనున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ జోరందుకుంది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బ్యాలెట్ పేపరుపై తెలుగులో కూడా అభ్యర్థి పేరు ముద్రించారు. మొదట తెలుగులో ఆ తరువాత ఇంగ్లిష్‌లో రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.  పోలింగ్ కేంద్రంలో రెండు కంపార్ట్ మెంట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 119 ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలందరికీ గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్‌ను ముద్రించారు. రాష్ర్టానికి చెందిన ఎంపీలు ఢిల్లీలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రంలో ఇచ్చే వయలెట్ కలర్ పెన్నును మాత్రమే శాసనసభ్యులు ఉపయోగించాలి. బ్యాలెట్ పేపరుపై ప్రాధాన్య క్రమాన్ని సూచిస్తూ ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపరుపై అంకెలను మాత్రమే రాయాలి.. నంబర్లను అక్షరాల్లో రాయడం, వేలిముద్ర వేయడం, టిక్ మార్కు పెట్టడం, రౌండప్ చేయడం, సంతకాలు పెట్టడం, ఇతర రాతలు రాస్తే ఆ ఓటు చెల్లదు. 1, 2 నంబర్లు మాత్రమే వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ చినిగినా, ముక్కలైనా కొత్త బ్యాలెట్ పేపరు ఇవ్వరు. మొదటి ప్రాధాన్య ఓటు వేయకుండా రెండో ప్రాధాన్య ఓటు వేస్తే ఆ ఓటు చెల్లదు. ఓటింగ్ సమయంలో ఫోన్ అనుమతించరు. డిపాజిట్ చేయడానికి ప్రత్యేక స్థలాన్ని అధికారులు ఏర్పాటు చేశారు.

పార్టీలవారీగా కాకుండా రాష్ట్రపతి అభ్యర్థులు ఇద్దరు చొప్పున ఏజెంట్లుగా నియమించుకునే అవకాశాన్ని కల్పించారు. వీరిలో ఒకరు ఎన్నికల విధుల్లో ఉంటారు. మరొకరు రిలీవర్‌గా వ్యవహరిస్తారు. గతంలోలాగా కాకుండా ఈసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతరులను ఎవరినైనా ఏజెంట్లుగా నియమించుకోవచ్చు. బ్యాలెట్ బాక్స్ ను రేపు ఉదయం ఢిల్లీకి తరలిస్తారు. ఈ నెల 20వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే ఓటు విలువ 132గా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్ణయించారు. ఈ ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్ అధికారి, వాణిజ్య పరిశ్రమలశాఖ సంయుక్త కార్యదర్శి సునీల్‌కుమార్‌ను నియమించారు. రేపు బ్యాలెట్ బాక్స్ ఢిల్లీకి వెళ్లే వరకు ఆయన ఇక్కడే ఉంటారు.

రాష్ట్రపతి ఎన్నికల కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి పోలీసు అధికారులతో ఏఆర్‌వో రాజాసదారాం సమావేశమయ్యారు. ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రపతి ఎన్నికలో బ్యాలెట్ పేపరుపై అభ్యర్థుల పేర్లు మాత్రమే ఉంటాయి. ఇతర ఎన్నికల్లో మాదిరిగా నోటాకు అవకాశం లేదు.