నేడు భారత్, వెస్టిండీస్ ఏకైక టీ20

కరేబియన్ గడ్డపై వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా.. టీ20 పోరుకు సన్నద్ధం అవుతోంది. మేటి హిట్టర్లతో కూడిన వెస్టిండీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వన్డే సిరీస్ విక్టరీ జోష్ లో ఉన్న కోహ్లీ గ్యాంగ్ ఈ మ్యాచ్ లోనూ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అటు టీ20 సూపర్ స్టార్ క్రిస్ గేల్ రాకతో విండీస్ టీమ్ అత్యంత బలంగా మారింది. కనీసం అచ్చొచ్చిన టీ20 మ్యాచ్ లోనైనా నెగ్గి లెక్క సరిచేయాలని చూస్తోంది. జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది.

టీ20 మ్యాచ్ కోసం టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించనుంది. ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ ఓపెనర్ గా రాణించిన కోహ్లీ.. ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఇక తుది జట్టులో యువరాజ్ కు అవకాశం రానుంది. మిడిలార్డర్ లో ధోనీ, హార్ధిక పాండ్యాలు రాణిస్తే టీమిండియాకు ఎదురు ఉండదు. ఇక యంగ్ గన్ రిషభ్ పంత్ సైతం ఈ మ్యాచ్ లో సత్తా చాటేందుకు సిద్దం అవుతున్నాడు. కేదార్ జాదవ్ తో పాటు యంగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం.. రాణించేందుకు రెడీగా ఉన్నారు. పేస్ విభాగంలో ఉమేష్ కు జతగా భువనేశ్వర్ బరిలోకి దిగనున్నాడు.

మరోవైపు డాషింగ్ హిట్టర్ గేల్ రాకతో విండీస్ అత్యంత బలంగా మారింది. 15 నెలల తర్వాత బరిలోకి దిగుతున్న గేల్ ఘనంగా రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అటు కెప్టెన్ బ్రాత్ వైట్ తో పాటు సీనియర్ శామ్యూల్స్ పై విండీస్ భారీ ఆశలే పెట్టుకుంది. ఇక మిస్టరీ స్పిన్నర్లు నరైన్, బద్రీ లతో పాటు పేస్ బౌలర్లు టేలర్, విలియమ్స్ తో విండీస్ బౌలింగ్ ఎటాక్ అద్భుతంగా ఉంది.

ఇరుజట్ల బలాబలాలు చూస్తే టీమిండియాపై విండస్ కు ఘనమైన రికార్డే ఉంది. ఇప్పటి వరకు రెండు జట్లు..  7 మ్యాచ్ ల్లో పోటీపడగా.. నాలుగు మ్యాచ్ ల్లో విండీస్ విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్ లో టీమిండియా నెగ్గింది. ఓ మ్యాచ్ లో ఫలితం తేలలేదు.